మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది..
పదండి ముందుకు,
పదండి త్రోసుకు..
పోదాం, పోదాం పైపైకి..
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి..
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు.
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి..
ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా చావండి
నెత్తురు మండే
శక్తులు నిండే
సైనికులారా..రారండి..
హరోం హరోం హర
హర హర హర హర
హరోం హరా అని కదలండి
మరో ప్రపంచం
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది..
పదండి ముందుకు పదండి త్రోసుకు
ప్రభంజనం వలె హోరెత్తండీ
భావ వేగమున ప్రసరించండి
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి
పదండి
పదండి
పదండి ముందుకు
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు..
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్..
జలప్రళయ నాట్యం చేస్తున్నవి..
సలసల క్రాగే చమురా? కాదిది,
వుష్ణరక్త కాసారం..
శివసముద్రము,
నయాగరావలె
వురకండి ముందుకు
పదండి ముందుకు
పదండి త్రోసుకు
మరో ప్రపంచపు కంచు నగారా
విరామమెరుగక మ్రోగింది
త్రాచులవలెను,
రేచులవలెను,
ధనుజయునిలా సాగండి..
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్ర బావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు?
Friday, November 13, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment